హైదరాబాద్ :‘‘నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది'' అనే డైలాగు మరో సారి ధియోటర్ లో మారు మ్రోగనుంది. రజనీకాంత్ చిత్రం ‘శివాజి'చిత్రాన్ని 3డిలోకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ అంటే వచ్చే నెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాతలు తెలియచేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాల్ని ప్రదర్శించారు.
చిత్ర నిర్మాత ఎం.ఎస్.గుహన్ మాట్లాడుతూ...''మంచి కథ, కథనాలు, సాంకేతిక విలువలు ఉన్నాయి కాబట్టే 'శివాజి' చిత్రాన్ని త్రీడీలోకి మార్చాలనుకొన్నాం. అయితే ఈ విషయాన్ని మొదట్లో రజనీకాంత్‌కి కూడా చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక చూపిద్దామనుకొన్నాం. ఇటీవల ఆయన త్రీడీలో కొన్ని సన్నివేశాల్ని చూసి.. తెరపైన ఉన్నది నేనేనా? అంటూ ఆశ్చర్యపోయారు'' అన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'శివాజి'. శంకర్ దర్శకత్వం వహించారు. అయిదేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రస్తుతం త్రీడీ హంగులద్దుతున్నారు.
అలాగే ''నాలుగు వందల మంది సాంకేతిక నిపుణులు యేడాదిపాటు నిర్విరామంగా కృషి చేసి ఈ చిత్రాన్ని త్రీడీలోకి మార్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. అందరినీ అలరించేలా తీర్చిదిద్దారు. హాలీవుడ్ నుంచి వచ్చే ఈ తరహా చిత్రాల నిడివి తక్కువగా ఉంటుంది. అందుకే 'శివాజి' నిడివిని కూడా తగ్గించాం. ప్రస్తుతం సాంకేతికపరమైన కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.
చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్న ప్రసాద్స్ గ్రూప్స్ సంస్థ డైరెక్టర్ సాయిప్రసాద్ మాట్లాడుతూ ''టుడీ చిత్రాన్ని త్రీడీలోకి మార్చడం ఒక గొప్ప ప్రక్రియ. కొన్ని కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని కొంత కుదించాం. ‘శివాజి 3డి' నిడివి 2 గంటల 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం 3డి వర్క్ తుదిదశకు చేరుకుందిమరిన్ని చిత్రాల్ని త్రీడీలోకి మార్చబోతున్నాము''అన్నారు. ఈ కార్యక్రమంలో వసంత్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ‘శివాజి 3డి' వెర్షన్‌లోని ‘పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..' పాటను మీడియాకు ప్రదర్శించారు.